Congress: హరీశ్ రావు తప్పు చేశారు.. అందుకే నా ఆరోపణలపై స్పందించడం లేదు!: జగ్గారెడ్డి

  • కేసీఆర్ వల్ల సంగారెడ్డికి మేలు జరుగుతుంది
  • హరీశ్ నిర్వాకంతో మంజీర-సింగూరు ఎండిపోయింది
  • హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత మీడియా సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఉందనీ, దీనివల్ల సంగారెడ్డి జిల్లాకు మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నిర్వాకంతోనే సింగూరు-మంజీరా ఎండిపోయిందని విమర్శించారు. తాను గత 15 రోజులుగా కోరుతున్నా.. నీళ్లు తీసుకున్న విషయమై హరీశ్ రావు స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

తాను తెలంగాణ సీఎం కేసీఆర్ ను నేరుగా కలవబోననీ, అన్ని విషయాలను మీడియా ద్వారానే చెప్పదలుచుకున్నానని జగ్గారెడ్డి అన్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం కేసీఆర్ ఇష్టమేనని వ్యాఖ్యానించారు. మంజీర-సింగూరు విషయంలో చేసిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ నిర్వాకంతో సంగారెడ్డిలో భూగర్భ జలాలు తగ్గిపోయాయనీ, బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. హరీశ్ రావు తప్పు చేశారు కాబట్టే తన ఆరోపణలపై స్పందించడం లేదని స్పష్టం చేశారు. అందుకే టీఆర్ఎస్ సైతం ఈ విషయంలో మౌనం పాటిస్తోందన్నారు.

More Telugu News