Andhra Pradesh: చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లే.. బాలయ్య సినిమాను ప్రజలు అందుకే వ్యతిరేకించారు!: లక్ష్మీపార్వతి

  • చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు
  • వర్మ నిజాయతీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు
  • మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తిరస్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ధైర్యంగా, నిజాయతీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తీసిన సినిమాలో వాస్తవం లేదు కాబట్టే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నిజాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందన్నారు. వాటీజ్‌ దిస్‌ అనేది...ఈ సినిమాతోనే తెలుస్తుందని ఆమె అన్నారు. వర్మకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో అకారణంగా తనపై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ మరణం, ఆనాటి పరిణామాలపై విచారణ కమిటీ వేయాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News