Pakistan: పాకిస్థాన్ తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి: గవాస్కర్

  • పాక్ తో ఆడకపోతే ఆ దేశంపై ప్రభావం చూపుతుంది
  • ఇదే సమయంలో మనం రెండు పాయింట్లు కోల్పోతాం
  • ప్రపంచకప్ లో రెండు పాయింట్లు కోల్పోవడం చిన్న విషయం కాదు

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రానున్న క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను ఆడకుండా చేయాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన శత్రుదేశమైన పాకిస్థాన్ తో ఆడి, వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు.

ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోతే మనం రెండు పాయింట్లు కోల్పోతామని గవాస్కర్ చెప్పారు. పాక్ తో మనం మ్యాచ్ ఆడకపోతే అది ఆ దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని... ఇదే సమయంలో ప్రపంచకప్ లాంటి టోర్నమెంట్ లో రెండు పాయింట్లను కోల్పోవడమంటే చిన్న విషయం కాదని... టోర్నమెంట్ నుంచి బాధతో నిష్క్ర్రమించే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. పాక్ తో మనం ఆడి, ఆ జట్టు సెమీస్ కు చేరకుండా నిలువరించాలని చెప్పారు. పాకిస్థాన్ తో ఆడకున్నా... నాకౌట్ కు క్వాలిఫై కాగల సత్తా టీమిండియాకు ఉందనే విషయం తనకు తెలుసని తెలిపారు.

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడకుండా నిషేధించాలనే అంశంపై గవాస్కర్ మాట్లాడుతూ, అది అంత సులభం కాదని చెప్పారు. పాక్ ను నిషేధించాలనే ప్రతిపాదనను ఇతర దేశాలు అంగీకరించవని తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య సమస్యని... ఇందులోకి తమను లాగవద్దని ఇతర దేశాలు చెప్పే అవకాశం ఉందని చెప్పారు.  

More Telugu News