నేడు అమిత్ షా రాజమండ్రి టూర్.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు!

21-02-2019 Thu 13:25
  • రోడ్లపై ర్యాలీలు, ధర్నా
  • అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు
  • పలువురు నేతలు, కార్యకర్తల అరెస్ట్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు నేడు ఆందోళనకు దిగాయి. క్వారీ సెంటర్‌ వద్ద బీజేపీ కార్యాలయాన్ని షా ఈరోజు ప్రారంభిస్తారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు నగరంలో బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి. బీజేపీ డౌన్ డౌన్, అమిత్ షా గో బ్యాక్, వీ వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ నినాదాలతో హోరెత్తించాయి. టీడీపీ కార్యకర్తలతో పాటు ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దుర్గాయాదవ్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. నేడు అమిత్ షా రాజమండ్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలతో షా ఈ సందర్భంగా ముచ్చటించనున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి.