ముద్దు కావాలంటే బురఖాలో రమ్మన్న ప్రియురాలు.. అనుమానంతో యువకుడిని చావగొట్టిన స్థానికులు!

21-02-2019 Thu 12:57
  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
  • ప్రేమికుల రోజున ముద్దు కోరిన ప్రియుడు
  • ప్రియురాలి సవాల్ తో కటకటాలపాలు
ప్రేమలో పడ్డవారు ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. బురఖా వేసుకుని వస్తే తాను ముద్దు ఇస్తానని ప్రియురాలు చెప్పడంతో ఓ యువకుడు ఆనందంతో పొంగిపోయాడు. ఈ క్రమంలో యువతితో కలిసి బయటకు వెళుతూ స్థానికులకు దొరికిపోయాడు. అతని వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు సదరు యువకుడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

తమిళనాడులోని పట్టాభిరామ్‌ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్‌ (22) అన్నాసాలైలోని ఐటీఐలో ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ట్రస్ట్‌ తరఫున ఉద్యోగ శిక్షణకు శక్తివేల్ వెళ్లగా, అక్కడే ఓ యువతి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా, ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ముద్దు కావాలని శక్తివేల్ అడగగా, యువతి నో చెప్పింది. చాలాసేపు బతిమాలడంతో ఓ షరతు పెట్టింది. బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకూ వస్తే ముద్దు ఇస్తానని ఛాలెంజ్ విసిరింది.

ఓస్ అంతేగా.. అనుకుంటూ యువకుడు బురఖాలో యువతి ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆమెను తీసుకుని మెరీనా బీచ్ కు చేరుకున్నాడు. అయితే శక్తివేల్ నడక, పురుషుల చెప్పులు చూసిన స్థానికులు అతడిని చుట్టుముట్టి, అసలు విషయం తెలుసుకుని అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో, వారొచ్చి శక్తివేల్ ను స్టేషన్ కు తరలించారు.