వైసీపీలోకి కొత్తగా వచ్చిన భిక్షగాడు నాపైన, రామసుబ్బారెడ్డిపైనా విమర్శలు చేస్తున్నాడు: ఆదినారాయణరెడ్డి

21-02-2019 Thu 11:30
  • జగన్ పత్రికలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • రాష్ట్రం బాగుపడకూడదని జగన్ కోరుకుంటున్నారు
  • టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ సైనికుల్లా పని చేయాలి

వైసీపీ అధినేత జగన్ కు చెందిన పత్రికలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో వైసీపీలోకి కొత్తగా వచ్చిన భిక్షగాడు తనపైన, రామసుబ్బారెడ్డిపైనా విమర్శలు చేస్తున్నాడని అన్నారు. వాళ్ల నాన్న రాజశేఖరరెడ్డిని మహానేత అని జగన్ అంటున్నారని.. రాష్ట్రాన్ని పదింతలు అభివృద్ధి చేసిన చంద్రబాబును ఏమని సంబోధించాలో ఆలోచించుకుని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామసుబ్బారెడ్డిని గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు.

రాష్ట్రం బాగుపడకూడదనే ఆలోచనలో జగన్ ఉన్నారని ఆదినారాయణరెడ్డి అన్నారు. వర్షాలు పడకూడదని, వీధి లైట్లు వెలగరాదని, రైతులకు నీరు అందకూడదని, ప్రమాదాలు జరగాలని, డ్వాక్రా మహిళలకు డబ్బు అందకూడదని జగన్ కోరుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం తాను, రామసుబ్బారెడ్డి కలిసిపోయామని తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని కోరారు.