ACB: జీతం రూ.60 వేలు...అంతకంటే ఎక్కువే ఈఎంఐల చెల్లింపులు!

  • నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ అవినీతిలో నమ్మలేని నిజాలు
  • బినామీలతోనే వ్యవహారాలన్నీ
  • ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు

అతని జీతం 60 వేల రూపాయలకు అటూ ఇటూ. కానీ కట్టే ఈఎంఐలు మాత్రం అంతకంటే ఎక్కువే. ఎలా అంటే అదే అతని అవినీతి రహస్యం అంటున్నారు ఏసీబీ అధికారులు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్‌ హనుమంతు శంకర్రావుపై ఏసీబీ దాడుల తర్వాత నిర్వహిస్తున్న విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

నిన్న శంకరరావు బస చేసిన లాడ్జితోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పలాసలోని అతని బంధువుల ఇళ్లు, కార్యాలయాలు 14 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. పలు కీలకపత్రాలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీతం కంటే చేసిన రుణాలకు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లు ఎక్కువ కడుతున్నారని కనుగొన్నారు. అక్రమ వ్యవహారాలన్నీ బినామీలతోనే నడిపిస్తూ బ్యాంకుకు నెలవారీ రుణవాయిదాలను వారితోనే చెల్లింపు చేయిస్తున్నట్లు గుర్తించినట్టు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు.

1991లో పురపాలక శాఖలో హెల్త్‌ అసిస్టెంట్‌గా చేరిన శంకర్రావు తర్వాత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, కమిషనర్‌గా పదోన్నతి పొందారు. భీమిలిలో గ్రేడ్‌-3 కమిషనర్‌గా చేసిన తర్వాత బొబ్బిలిలోనే నాలుగున్నరేళ్లు పనిచేశారు. పురపాలక పరిధిలో లేఅవుట్ల అనుమతులు, పారిశుద్ధ్య పనులు, ఆస్తి పన్ను మదింపులోనూ బినామీల ద్వారా వసూళ్లకు పాల్పడేవాడన్న ఆరోపణలున్నాయి.

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ద్వారానే ఎక్కువ వ్యవహారాలు నడిపించేవాడని సమాచారం. దీనిపైనే ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో కొన్నాళ్లు నిఘా పెట్టిన అధికారులు ఎట్టకేలకు దాడులు నిర్వహించారు. శంకరరావు ఆదాయానికి మించి 1.7 కోట్ల రూపాయలు కూడబెట్టాడని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఏడు కోట్ల రూపాయల పైమాటేనని డీఎస్పీ తెలిపారు.

More Telugu News