CM KCR: సార్వత్రిక ఎన్నికల తర్వాతే పరిషత్‌ ఎన్నికలు: క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

  • ఏప్రిల్‌ తర్వాత నోటిఫికేషన్‌కు అవకాశమని సూచాయగా వెల్లడి
  • కొత్త మున్సిపాలిటీ చట్టం రూపొందించాలని అధికారులకు ఆదేశం
  • దేశంలోని ఆదర్శప్రాంతాలను సందర్శించాలని సూచన

తెలంగాణ రాష్ట్రంలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఏప్రిల్‌ తర్వాత జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో సీఎం దీనిపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

 మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే.జోషి, పంచాయతీరాజ్‌, శాసనసభ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్‌ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు.

 అనంతరం మాట్లాడుతూ తనకున్న సమాచారం మేరకు లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పారు.

ఈలోగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తరహాలోనే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముందుగా దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి పలు అంశాలపై అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో మనకు ఉపయుక్తమయ్యే అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, వాటిలో మనకు ఉపయుక్తమయ్యేవాటితో కొత్త చట్టానికి రూపు ఇవ్వాలని  ఆదేశించారు. మేలోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తే వెనువెంటనే దాన్ని ఆమోదిస్తామని, ఆ మేరకు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News