జగన్ సొంత జిల్లాలో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ఖరారు?

21-02-2019 Thu 08:33
  • జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం
  • పులివెందులకు సతీశ్ రెడ్డి, జమ్మలమడుగుకు రామసుబ్బారెడ్డి ఖరారు
  • కడప లోక్ సభ బరిలో మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల పేర్లను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పులివెందుల నుంచి సతీష్‌ రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప లోక్‌ సభ స్థానం నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డిలకు ఇప్పటికే సీటు ఖరారు చేసిన చంద్రబాబు, మిగతా నియోజకవర్గాలపైనా ఓ అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.

కడప జిల్లా పరిధిలోని పార్టీ నేతలతో నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన, విజయావకాశాలపై నేతలతో మాట్లాడారు. రాయచోటి నుంచి రమేశ్ కుమార్ రెడ్డి, రాజంపేట నుంచి బత్తాల చెంగల్ రాయుడు, రైల్వే కోడూరు నుంచి టీ నరసింహ ప్రసాద్ (చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు) లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే, మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రా రెడ్డి (టీడీపీలో చేరితే) లేదా ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్, కడప నుంచి అహ్మదుల్లా తనయుడు అష్రాఫ్, కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డి లేదా వీరశివారెడ్డి, బద్వేల్ లో లాజరస్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.