modi: మోదీ, నేను అన్నదమ్ములం: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్

  • చరిత్రను రాయక ముందు నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి
  • 70 ఏళ్లుగా సౌదీ నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు
  • వందల ఏళ్లుగా భారత్ అభివృద్ధిలో సౌదీ ప్రజలు భాగస్వాములుగా ఉన్నారు

ప్రధాని మోదీ తనకు పెద్దన్నయ్య అని... తామిద్దరం అన్నదమ్ములమని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. మోదీ నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతానని చెప్పారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సల్మాన్ కు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ప్రొటోకాల్ ను సైతం పక్కనపెట్టి వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల నుంచి సల్మాన్ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, భారత్-సౌదీ అరేబియాల మధ్య వేల సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చరిత్రను రాయకముందు నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగాయని... స్నేహం మన డీఎన్ఏలోనే ఉందని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధి కోసం ఈ అనుబంధాన్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీల నాయకత్వంలో భారత్-సౌదీల మధ్య మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని అన్నారు.

గత 70 ఏళ్లుగా సౌదీ అరేబియా నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని సల్మాన్ కొనియాడారు. వందల ఏళ్లుగా ఎంతో మంది సౌదీ ప్రజలు భారత్ లో పని చేస్తూ, భారత్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని చెప్పారు.

More Telugu News