bjp: అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది!: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే

  • మిత్రపక్షాలతో ఎలా మెలగాలన్న విషయంలో బీజేపీలో మార్పు వచ్చింది
  • శివసేన అభ్యర్థి సీఎం కావాలనేది నా ఆకాంక్ష
  • ఎన్నికల యుద్ధంలో మనం గెలవాలి

మొన్నటిదాకా బీజేపీ, శివసేనలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాలతో ఎలా మెలగాలో కూడా బీజేపీకి తెలియదని శివసేన మండిపడింది. రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండానే ఎన్నికల బరిలోకి దిగుతామంటూ ఇరు పార్టీలు ప్రకటనలు చేశాయి. కానీ, రోజుల వ్యవధిలోనే రెండు పార్టీలు మళ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయి. గత సోమవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేలు భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, పార్టీ నేతలతో ముంబైలోని తన నివాసంలో ఉద్ధవ్ థాకరే భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను వారికి వివరించారు. 'మిత్రపక్షాలతో ఎలా మెలగాలన్న విషయంలో బీజేపీలో మార్పు వచ్చింది. ఆ విషయాన్ని నేను గమనించా. అందుకే ఆ పార్టీతో చేతులు కలపాలని నిర్ణయించా' అని ఉద్ధవ్ వివరించారు. అయితే, ఎక్కువ సీట్లను ఏ పార్టీ గెలుచుకుంటుందో... ఆ పార్టీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేద్దామని బీజేపీ చేసిన ప్రతిపాదన తనకు నచ్చలేదని చెప్పారు. శివసేన అభ్యర్థే సీఎం కావాలనేది తన ఆకాంక్ష అని... ఆ దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు. బీజేపీతో జరిగిన ఒప్పందంలో తాను గెలిచానని... అసలైన ఎన్నికల యుద్ధంలో మనం గెలవాలని పిలుపునిచ్చారు.

More Telugu News