pulwama Terror attack: పాక్ ప్రధాని కనీస సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు: జైట్లీ

  • ప్రపంచమంతా ఖండిస్తే ఇమ్రాన్ పెదవి విప్పలేదు
  • పుల్వామా దాడి సాక్ష్యాలు పాక్‌లోనే ఉన్నాయి
  • ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?

పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని కనీస సానుభూతి కూడా వ్యక్తం చేయలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రపంచం మొత్తం ఈ ఘటనను ఖండించి సానుభూతి వ్యక్తం చేస్తే.. ఇమ్రాన్ ఖాన్ మాటవరసకైనా సానుభూతి తెలపలేదని విమర్శించారు. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైతే ఇమ్రాన్ కనీసం ఖండించకపోగా ఆధారాలు కావాలంటూ డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. సాక్ష్యాలు మీ దేశంలోనే ఉన్నాయని ఘాటుగా బదులిచ్చారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే ఈ దాడికి పాల్పడిందని, ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిందని జైట్లీ పేర్కొన్నారు. ఇంతకంటే ఇంకేమి ఆధారాలు కావాలని ప్రశ్నించారు.

కాగా, పుల్వామా దాడి విషయంలో తమకే పాపం తెలియదని ఇమ్రాన్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే జైషే మహ్మద్ రెండో వీడియోను విడుదల చేయడం గమనార్హం. పుల్వామా దాడి తమ పనేనని మరోమారు స్పష్టం చేసింది. పుల్వామా వంటి దాడులను తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలమని జైషే ఆ వీడియోలో పేర్కొంది.

More Telugu News