Andhra Pradesh: శవాలపై పేలాలు ఏరుకునే ‘420’ జగన్ మోహన్ రెడ్డి: నారా లోకేశ్ ఫైర్

  • రైతును కాపాడటానికి పోలీసులు ఎంతో శ్రమించారు
  • వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైంది
  • తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సీఎం కావాలని జగన్ చూశారు 

గుంటూరు జిల్లా కొండవీడులో నిన్న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రైతు పిట్టల కోటేశ్వరరావు (కోటయ్య) చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ సమీపంలో ఆ గ్రామానికి చెందిన కోటయ్యకు చెందిన తోటలను నాశనం చేశారని, పోలీసులు కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

శవాలపై పేలాలు ఏరుకునే ‘420 జగన్ మోహన్ రెడ్డి గారు’ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ధి రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని ‘420’ ఆరాటపడుతున్నారని, కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి, నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైసీపీ ఎజెండానా? అని నిప్పులు చెరిగారు. రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదన్న విషయం జగన్ దొంగ పత్రికకు తెలియదా? వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందని, శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు.

ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని ఓ వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు. ఇంత కష్టపడితే జగన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం పోలీసులపై నిందలు వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.    


More Telugu News