Narendra Modi: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఎగతాళి చేస్తే శిక్ష తప్పదు: హెచ్చరించిన ప్రధాని

  • మన ఇంజనీర్లను మనమే విమర్శించుకుంటామా!
  • దేశాన్ని అవమానించినట్టా? కాదా?
  • సరైన పద్ధతి కాదన్న మోదీ

ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన స్వదేశీ తయారీ 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ ను ఎగతాళి చేస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోనే మొట్టమొదటి ఇంజన్ రహిత రైలుగా, అత్యంత వేగవంతమైన రైలుగా ప్రచారం అందుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆదిలోనే అపశ్రుతి ఎదుర్కోవాల్సి వచ్చింది. సాంకేతిక కారణాలతో మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. ఇదే అదనుగా మోదీ వ్యతిరేకులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై సెటైర్లు గుప్పించారు. దీనిపై మోదీ తీవ్రంగా స్పందించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఎగతాళి చేయడం అంటే మన ఇంజినీర్లను, మన సాంకేతిక నిపుణులను అవమానించినట్టేనని అన్నారు.

వారణాసిలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ "కొంతమంది వ్యక్తులు ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. నిజంగా ఇది దురదృష్టకరం. ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకున్న  టెక్నీషియన్లు, ఇంజినీర్లకు ఇది తీరని అవమానం. దేశాన్ని, మన నిపుణులను కించపరిచే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఇంజినీర్లే మనకు బుల్లెట్ ట్రయిన్ అందిస్తారు. అలాంటి ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను అవమానించడం సరైనదేనా? అలా ఎగతాళి చేసేవాళ్లను క్షమించాలా? వాళ్లకు సరైన సమయంలో సరైన శిక్ష విధించాలా వద్దా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రారంభోత్సవ ప్రయాణంలో వారణాసి నుంచి ఢిల్లీ తిరిగొస్తుండగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దాంతో ఆ ట్రయిన్ లోని ప్రయాణికులను మరో రైలు తెప్పించి దాంట్లో గమ్యస్థానానికి చేర్చాల్సి వచ్చింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున సెటైర్లు వస్తున్నాయి.

More Telugu News