Tirumala: టీటీడీ వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన.. పాలక మండలి ఆమోదం

  • 8 సమస్యల పరిష్కారానికి ఆమోదం
  • రూ.47.44 కోట్లతో పీఏసీ నిర్మాణం
  • జీతాల చెల్లింపునకు రూ.625 కోట్లు

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తన వార్షిక బడ్జెట్ కు రూపకల్పన జరిగింది. రూ.3,116 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపినట్టు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, బోర్డు సభ్యులతో నేడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులు 14 అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారని.. వాటిలో 8 సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపిందన్నారు.

కల్యాణి జలాశయం నుంచి రెండో పైప్‌లైన్ ఏర్పాటుకు పాలక మండలి నుంచి ఆమోదం లభించిందన్నారు. అలాగే తిరుమలలో రూ.47.44 కోట్లతో పీఏసీని నిర్మించనున్నట్టు తెలిపారు. సిబ్బంది జీతాల చెల్లింపునకు రూ.625 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.270 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.235 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు పేర్కొన్నారు.

More Telugu News