common cause: 'సీబీఐ' నాగేశ్వరరావు నియామకంపై పిటిషన్ కొట్టివేత.. విచారణ అవసరం లేదన్న సుప్రీం

  • సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై ఎన్జీఓ సవాల్
  • సీబీఐకు కొత్త డైరెక్టర్ ని  నియమించారు
  • ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు

గతంలో సీబీఐ ఉన్నతాధికారులైన అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమిస్తూ నాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పుడు సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తిరిగి అలోక్ నే ఆ విధుల్లోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిండం జరిగింది. అయితే, ఆ తీర్పు వెలువడ్డ రెండురోజుల్లోనే అలోక్ వర్మను ఆ పదవి నుంచి తప్పించి, వేరే శాఖకు బదిలీ చేశారు. దీంతో, మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావుని కేంద్రం నియమించడం తెలిసిందే.

అయితే, గతంలో జరిగిన ఈ తతంగంపై ‘కామన్ కాజ్’ అనే ఎన్జీవో ప్రశ్నించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీబీఐకు కొత్త డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను నియమించడం జరిగిందని, దీంతో ఇక, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతూ, సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది. కాగా, ఈ నెల 4న సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఐపీయస్ అధికారి రిషి కుమార్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది.  

More Telugu News