kondaveedu kota: రైతును పోలీసులు కొట్టడం ఎవరైనా చూశారా? ఎటు పోతున్నాం? ఇంత విష ప్రచారమా?: గుంటూరు రూరల్ ఎస్పీ ఫైర్

  • పనికట్టుకుని పోలీసు శాఖపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • పోలీసు శాఖ నిర్వీర్యమైతే.. సమాజం నిర్వీర్యమైపోతుంది
  • రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు పక్కన పాలేరు ఉన్నాడు

కొండవీడు కోట ముగింపు ఉత్సవాల సందర్భంగా కోటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు కొట్టడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ అధినేత జగన్ సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఖండించారు.

మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ... కోటేశ్వరరావు అనే రైతు తన పొలం వెనుకవైపు ప్రాంతంలో ఎండ్రిన్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు. పోలీసు శాఖను నిందిస్తూ, గౌరవానికి భంగం కలిగిస్తూ విష ప్రచారం జరుగుతోందని... అందుకే తాను మీడియా సమావేశం పెట్టానని తెలిపారు.

రైతు అనుమతితోనే ముందుభాగంలో ఉన్న 4 ఎకరాల భూమి ప్రాంతంలో తాము కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఎస్పీ చెప్పారు. పురుగుల మందు తాగిన సమయంలో అతని పక్కన పున్నారావు అనే పాలేరు ఉన్నాడని... ఘటన జరిగిన వెంటనే పక్కనే ఉన్న వందలాది మంది పోలీసులకు చెప్పకుండా మృతుడి కుమారుడికి పున్నారావు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు.

దాదాపు 25, 30 నిమిషాల వరకు పోలీసులకు ఈ విషయమే తెలియదని అన్నారు. అతని కుమారుడు బైక్ పై ఘటనా స్థలికి వచ్చాడని... వాస్తవానికి సభ ఉన్న నేపథ్యంలో బైక్ లను ఆ స్థలానికి అనుమతించలేదని... కానీ, తన తండ్రి పురుగుమందు తాగాడని చెప్పడంతో పోలీసులు అతన్ని ఆపకుండా పంపించారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పురుగుమందు తాగిన వ్యక్తిని పోలీసులు భుజాన వేసుకుని వచ్చారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు.

అతన్ని కాపాడాలనే తాపత్రయంలో పక్కనే ఉన్న విద్యుత్ శాఖకు చెందిన వాహనాన్ని పొలంలోకి తీసుకెళ్లడం జరిగిందని... ఈ క్రమంలో రెండుమూడు లైన్ల కనకాంబరం మొక్కలు పాడయ్యాయని ఎస్పీ చెప్పారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా దురదృష్టవశాత్తు కాపాడలేకపోయామని తెలిపారు. ఇంత చేసినా పోలీసులపై చాలా దారుణంగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు.

పోలీసులు తప్పు చేస్తే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని... శాఖాపరంగా తామే శిక్షిస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితం చిన్న తప్పు చేసిన ఒక ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశామని... సత్తెనపల్లిలో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రిమినల్ కేసులు పెట్టి, సస్పెండ్ చేశామని తెలిపారు. పోలీసు శాఖ నిబద్ధత ఇదని చెప్పారు. ఈ ఘటనపై కూడా డీఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ చేయిస్తామని తెలిపారు.

రైతును పోలీసులు కొట్టి చంపారనే విషప్రచారానికి తెరలేపారని... సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఎవరు కొట్టి చంపారని ఎస్పీ ప్రశ్నించారు. హెలిపాడ్ కోసం రైతు పొలం తీసుకున్నారనే ప్రచారం కూడా చేస్తున్నారని... వాస్తవానికి రైతు పొలానికి, హెలిప్యాడ్ కు అర కిలోమీటర్ పైగా దూరం ఉందని చెప్పారు. పురుగుమందు తాగి చనిపోయాడని పాలేరు పున్నారావే చెబుతున్నాడని అన్నారు. కనకాంబరం పంటను పోలీసులు తొక్కేశారంటూ మరో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తోటలో ముందువైపు కొంచెం బొప్పాయి తోట ఉందని... తోటలోకి ఎవరూ రాకుండా చూడాలని మృతుడి భార్య కోరితే... మైక్ లో అనౌన్స్ మెంట్ చేయడం కూడా జరిగిందని చెప్పారు. విపరీతమైన ఎండ ఉన్న కారణంగా సేద తీరేందుకు కొందరు చెట్ల కిందకు వెళ్లి ఉండవచ్చని తెలిపారు. జరిగింది ఇదైతే... పోలీసులు కొట్టి చంపారని, కనకాంబరాల పంట నాశనం చేశారని, బొప్పాయి కోసేశారని ఇష్టమొచ్చినట్టు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒక 50 బొప్పాయిలు కోసినా... వాటి విలువ రూ. 500 ఉంటుందని... ఈ మాత్రానికే మనస్తాపం చెంది ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

పోలీస్ శాఖను నిర్వీర్యం చేయాలనే పనులను మానుకోవాలని... పోలీసు శాఖ నిర్వీర్యమైతే సమాజం మొత్తం నిర్వీర్యమవుతుందని రాజశేఖర్ బాబు అన్నారు. విషయం తెలిసిన వెంటనే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారని... దాన్ని కూడా ఇష్యూ చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పని కట్టుకుని దుష్ప్రచారం చేయవద్దని కోరారు. పోలీసులు కొట్టారనే విషయాన్ని ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. పక్కనున్న పున్నారావు కూడా పోలీసులు కొట్టారని చెప్పడం లేదని అన్నారు. మనమంతా ఎటు పోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావు పోస్ట్ మార్టంను కూడా వీడియో షూట్ చేయించామని చెప్పారు. 

More Telugu News