Telangana: పదవులు అంటే అధికారం కాదు బాధ్యత: టీ-మంత్రి జగదీశ్ రెడ్డి

  • రెండోసారి మంత్రిగా అవకాశం దక్కడం సంతోషకరం 
  • నాకు  ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా నిర్వహిస్తా 
  • మంత్రి వర్గంలో మహిళలు లేనంత మాత్రాన తప్పుబట్టాల్సిన పని లేదు

పదవులు అంటే అధికారం కాదని, బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రెండోసారి పదవి దక్కించుకున్న జగదీశ్ రెడ్డి అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ప్రజలకు సేవ చేసే విషయంలో మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెండోసారి మంత్రిగా పని చేసే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అదే విధంగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

గతంలో విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసిన మీకు మళ్లీ అదే శాఖ ఇచ్చే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తనకు ఏ శాఖ కేటాయించినా ఫర్వాలేదని చెప్పారు. ఏ శాఖ అయినా బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేనంత మాత్రాన తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వ హయాంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు.

More Telugu News