India: పెళ్లి సెలవు ప్రాణాలను కాపాడింది.. పుల్వామా దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జవాను!

  • సీఆర్పీఎఫ్ లో జవాన్ గా పనిచేస్తున్న థాకా బేల్కర్
  • ఈ నెల 24న వివాహానికి దరఖాస్తు
  • చివరి నిమిషంలో సెలవు మంజూరుచేసిన అధికారులు

అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయినా తప్పించుకోవచ్చు అనడానికి తాజా ఘటనే ఉదాహరణ. జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఇదే బస్సులో వెళ్లాల్సిన ఓ జవాన్ మాత్రం చివరి నిమిషంలో సెలవు దక్కడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రాంతానికి చెందిన థాకా బేల్కర్‌ సీఆర్పీఎఫ్ లో జవానుగా పనిచేస్తున్నారు. ఈ నెల 24న వివాహం నేపథ్యంలో బేల్కర్ సెలవు కావాలని కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేశారు.

ఈ క్రమంలో ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ కు బయలుదేరింది. అందులో వెళ్లేందుకు బేల్కర్ కూడా సిద్ధమయ్యారు. తీరా వాహనంలోకి వెళ్లి కూర్చోగానే అధికారులు సెలవు మంజూరుచేసినట్లు సమాచారం అందింది. దీంతో సంతోషంతో బస్సు దిగిన బేల్కర్ సహచరులకు వీడ్కోలు చెప్పి ఇంటికి ప్రయాణమయ్యారు.

ఇంటికి చేరుకోగానే సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగినట్లు, ఆ ప్రమాదంలో తాను ఎక్కి దిగిన బస్సులోని సహచరులు అసువులు బాసినట్టు తెలుసుకున్న బేల్కర్ షాక్ కు గురయ్యారు. పుల్వామా ఘటన అనంతరం బేల్కర్ తమతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని ఆయన సోదరుడు అరుణ్ తెలిపారు. వివాహం జరగబోతోందన్న ఆనందం బేల్కర్ లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News