omar abdullah: జవాన్లను చంపింది టెర్రరిస్టులే.. ముస్లింలు కాదు: ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ

  • టెర్రరిస్టులు, కశ్మీరీ ముస్లింలు ఒకటే అని చిత్రీకరించే కుట్ర జరుగుతోంది
  • ప్రజాస్వామ్య దేశంలో సొంత ప్రజలపైనే దాడు జరుగుతుండటం దారుణం
  • ఈ భయోత్పాతానికి వ్యతిరేకంగా అందరం ఏకమవుదాం

పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో... జమ్ముకశ్మీర్ లో భద్రతాదళాలు భారీ ఎత్తున ముష్కరుల ఏరివేత చర్యలను చేపట్టాయి. గంటల వ్యవధిలోనే ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ను కూడా హతమార్చాయి. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. ఈ దాడులను జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు తప్పుబట్టారు. ఉగ్రదాడికి పాల్పడింది టెర్రరిస్టులేనని... కశ్మీరీ ముస్లింలు కాదని వారు అన్నారు. మచ్చను తొలగించుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమే ఈ తాజా హింస అని... దీనికి కశ్మీరీ ముస్లింలు బాధితులుగా మారుతున్నారని చెప్పారు.

వాస్తవానికి అబ్దుల్లా, ముఫ్తీల మధ్య రాజకీయపరమైన వైరం ఉంది. ఎన్నో సందర్భాల్లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కానీ, కశ్మీరీ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు... ఇద్దరినీ ఒకే తాటిపైకి తెచ్చాయి.

'కశ్మీరీ ముస్లింలపై హింసకు పాల్పడటం ద్వారా దేశంలోని వివిధ వర్గాల మధ్య చీలిక తీసుకురావాలనుకుంటున్నారు. భయోత్పాతం ద్వారా జనాలను విడగొట్టడాన్ని మేము అంగీకరించం. సీఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీరీ ముస్లింలు కానీ, జమ్ము ముస్లింలు కానీ దాడి చేయలేదు. మా మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తే... సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన వారి ఉచ్చులో కొందరు పడే అవకాశం ఉంది. మనల్ని విభజించాలనుకుంటున్న భయోత్పాతానికి వ్యతిరేకంగా అందరం ఏకమవుదాం. హింసను ఎదుర్కొందాం' అంటూ ఇద్దరు నేతలు సంయుక్తంగా ఒక ప్రకటన ఇచ్చారు.

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో సొంత ప్రజలపై హింస చోటు చేసుకుంటుండటం దారుణమని ఒమర్, మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులు, కశ్మీరీలు ఒకటే అని చిత్రీకరించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

పుల్వామా ఘటన జరిగిన తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ కు చెందిన వ్యక్తులపై దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. బీహార్ లో కశ్మీరీ వర్తకులపై దాడి జరిగిందని కథనాలు వచ్చాయి. ఉత్తరాఖండ్ లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అద్దెకు ఉంటున్న నివాసాలను ఖాళీ చేయాలని స్థానికులు కశ్మీరీ విద్యార్థులను కోరినట్టు వార్తలు వచ్చాయి.

More Telugu News