Andhra Pradesh: చంద్రబాబు గారూ.. ఆ రైతును మీరే చంపేశారు.. ఈ రాక్షసత్వం ఏంటి?: వైఎస్ జగన్ ఆగ్రహం

  • రైతును కొనఊపిరితో వదిలేశారు
  • మీ హెలికాప్టర్ కోసం పొలాన్ని నాశనం చేశారు
  • ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో నిన్న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కొట్టడంతోనే రైతు కోటేశ్వరరావు అలియాస్ కోటయ్య చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. కొండవీడుకు చెందిన రైతు కోటయ్యను ఏపీ ముఖ్యమంత్రే చంపేశారని ఆరోపించారు.

ఈరోజు జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?’ అని నిలదీశారు.

చారిత్రక కొండవీడు కోట ఘాట్‌ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం రెండురోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నిన్న యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని బొప్పాయి, మునగ, కనకాంబరం తోటలు సాగు చేస్తున్నారు.

కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని పోలీసులు పార్కింగ్‌ కోసం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన పున్నారావుతో కలిసి కోటేశ్వరరావు తన పొలం వద్దకు వెళ్లగా తోటలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం వస్తున్నందున ఈ ప్రాంతమంతా తమ అధీనంలో ఉందంటూ అడ్డు చెప్పారు. కాపుకొచ్చిన బొప్పాయి తోటలో చొరబడి నాశనం చేయడంతోపాటు ఇష్టారాజ్యంగా కాయలు కోయడాన్ని చూసి ఇదేం అన్యాయమంటూ కోటేశ్వరరావు ప్రశ్నించాడని, దీంతో ఆగ్రహించిన పోలీసులు విచక్షణా రహితంగా అతనిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు.

More Telugu News