Maharashtra: బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు.. ఇరుపార్టీల నేతల ప్రకటన

  • లోక్ సభ కు బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాం 
  • ఎన్డీఏ విజయం సాధించడం ఖాయం

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు ఖరారైంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఓ ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం ఫడ్నవీస్, బీజీేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ తో కలిసి ‘శివసేన’ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. సీట్ల సర్దుబాటు విషయమై చర్చించారు.

 అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీలు ఓ ప్రకటన చేశాయి. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ, రానున్న లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి అధికారంలో కొస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా డిమాండ్ చేశారని, దీని నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పామని అన్నారు. మహారాష్ట్రకు సంబంధించిన విషయాల్లో శివసేన చేసిన కొన్ని డిమాండ్లకు తాము అంగీకరించినట్టు ఫడ్నవీస్ వివరించారు. అనంతరం, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, అన్ని విషయాలను ఫడ్నవీస్ చెప్పారని, తాను చెప్పాల్సింది ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా పుల్వామా ఘటనలో అసువులు బాసిన వీరజవాన్లకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 ప్రకారం సీట్ల సర్దుబాటుకు రెండు పార్టీలు అంగీకరించినట్టు సమాచారం.

More Telugu News