Visakhapatnam District: ‘బొంగులో చికెన్’కు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం

  • అరకు ప్రాంతపు ప్రత్యేక వంటకం బొంగులో చికెన్
  • 105 నిమిషాల్లో 15 అడుగుల బొంగులో తయారీ
  • ఏపీ సర్కార్, టూరిజం శాఖ, మ్యారియట్ హోటల్, విశాఖ ఆధ్వర్యంలో ఇది తయారీ

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకు మన్యం ప్రాంతపు ప్రత్యేక వంటకం ‘బొంగు లో చికెన్’కు తగిన గౌరవం దక్కింది. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఈ వంటకానికి స్థానం లభించింది. 105 నిమిషాల్లో 15 అడుగుల వెదురు బొంగులో చికెన్ ను ఏపీ పర్యాటక శాఖ తయారు చేసింది. దీనికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధి హాజరయ్యారు. విజయవాడలోని బ్లెర్మ్ పార్క్ లో భారీ వెదురుబొంగులో చికెన్ ని తయారు చేశారు. మ్యారియట్ హోటల్ చెఫ్ రూపేశ్ ఆధ్వర్యంలో దీనిని తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ వంటకానికి గుర్తింపు తెచ్చే నిమిత్తం ఏపీ పర్యాటక శాఖ ఈ ప్రయత్నం చేసింది.

అంతకు ముందు, మ్యారియట్ హోటల్ చెఫ్ రూపేశ్ మీడియాతో మాట్లాడుతూ, అరకుకు చెందిన ఈ వంటకం చాలా ప్రత్యేకమైందే కాదు, పురాతనమైంది కూడా అని అన్నారు. వంట చేసేందుకు ఎటువంటి పాత్రలు లేని కాలంలో బొంగులో మాంసాన్ని ఉంచి ఈ వంటకాన్ని తయారు చేసుకునేవారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం, టూరిజం శాఖ, మ్యారియట్ హోటల్, విశాఖపట్టణం ఆధ్వర్యంలో భారీ వెదురు బొంగులో ఈ చికెన్ ని తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.

ఈ వంటకం తయారు చేసేందుకు రెండు గంటల సమయం పడుతుందని, పచ్చి వెదురు బొంగులో ఈ మాంసాన్ని ఉంచి బొగ్గులపై దీనిని కాలుస్తామని చెప్పారు. ఒక ఆంధ్రా వంటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు.

More Telugu News