Karnataka: 'జయహో పాకిస్థాన్' అన్న కర్ణాటక ఉపాధ్యాయురాలు... కటకటాల వెనక్కు పంపిన పోలీసులు!

  • బెళగావిలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న జిలేఖాబీ
  • పాక్ అనుకూల పోస్టులు పెట్టడంతో కలకలం
  • దేశాన్ని అవమానించినందుకు అరెస్ట్

పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని సమర్థించిన ఓ కన్నడ ఉపాధ్యాయురాలు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఉగ్రదాడి తరువాత, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 'పాకిస్థాన్ కు జయహో' పోస్ట్ పెట్టి, కష్టాలను కొని తెచ్చుకుంది. బెళగావిలోని శివపురలో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న జిలేఖాబీ అనే టీచర్ ఇలా పాక్ కు అనుకూల పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేపింది.

ఆమె ఇంటిని చుట్టుముట్టిన కొందరు హిందూ సంఘాల యువకులు, రాళ్లు రువ్వి, ఇంటిని తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జిలేఖాబీని, ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దేశాన్ని అవమానించేలా ఆమె ప్రవర్తించారని కేసు నమోదు చేసిన పోలీసులు, స్థానిక న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, ఆయన రిమాండ్ విధించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. బారాముల్లా జిల్లాకు చెందిన తాహీర్‌ లతీఫ్‌, కశ్మీరీ విద్యార్థి అబిద్‌ మాలిక్‌ తదితరులపై ఇవే తరహా ఆరోపణలతో అభియోగాలు నమోదయ్యాయి.

More Telugu News