Vijayawada: విజయవాడలో తాగి స్కూలుకు వస్తున్న విద్యార్థినులు.. విస్తుపోయిన ఉపాధ్యాయులు

  • ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు
  • శీతల పానీయంలో మద్యం కలుపుకుని రోజూ పాఠశాలకు
  • తరగతి గదిలోనే తాగి తూలుతున్న వైనం

విజయవాడ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రోజూ మద్యం తాగి స్కూలుకు వస్తున్న విషయం తెలిసి ఉపాధ్యాయులు విస్తుపోయారు. వారి నుంచి మద్యం వాసన వస్తుండడం, తోటి విద్యార్థుల మీద పడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి పరీక్షిస్తే అసలు విషయం బయటపడింది.

బాలికలు రోజూ శీతలపానీయంలో మద్యం కలుపుకుని స్కూలుకు తీసుకొస్తున్నారు. చున్నీని అడ్డంగా పెట్టి ఎవరికీ కనబడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. శనివారం కూడా అదే పనిచేశారు. అనంతరం పక్కనే కూర్చున్న విద్యార్థులపై తూలిపడ్డారు. వారి నుంచి మద్యం వాసన వస్తుండడంతో తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే వారు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలికలు ఇద్దరికీ పరీక్షలు నిర్వహించారు. బాలికలు ఇద్దరూ మద్యం తాగినట్టు పరీక్షల్లో తేలడంతో అందరూ విస్తుపోయారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

బాలికలు ఇద్దరూ గతంలో చదువుకున్న స్కూల్లోనూ ఇలాగే చేస్తే టీసీలు ఇచ్చి పంపించారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండడంతో సీసాలో మిగిలిన దానిని వీరు తాగేవారని, అది క్రమంగా అలవాటుగా మారిందని వివరించారు. వారి వల్ల తోటి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రుల సమక్షంలోనే టీసీలు ఇచ్చి పంపినట్టు తెలిపారు.

More Telugu News