Pakistan: ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా మెరుపుదాడి: ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా సమరోత్సాహం

  • దేశ రక్షణే ముఖ్యం
  • ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొంటాం
  • యుద్ధానికి సిద్ధం అంటున్న ఐఏఎఫ్

పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఓవైపు దౌత్య మార్గాల ద్వారా పాకిస్థాన్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే మరోవైపు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని సంకేతాలు పంపుతోంది. తాజాగా రాజస్థాన్ లోని పోఖ్రాన్ వద్ద జరిగిన వైమానిక విన్యాసాలు భారత వాయుసేన యుద్ధ సన్నద్ధతకు నిదర్శనంలా నిలిచాయి. పోఖ్రాన్ లో వాయుశక్తి-2019 ప్రారంభోత్స కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన ఎయిర్ ఛీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సమరోత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్ పై మెరుపుదాడికి వాయుసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

వైమానిక దళం తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసేందుకు సదా ముందుంటుందని, భారత వాయుసేనకు దేశ సమగ్రతే ముఖ్యమని అన్నారు. దేశ రక్షణ కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని బీఎస్ ధనోవా ఉద్ఘాటించారు. యుద్ధం వస్తే భారత్ ను ఓడించలేమని తెలిసే పాకిస్థాన్ ఇలా దొంగదెబ్బ తీస్తోందని ఆయన ఆరోపించారు. పుల్వామా దాడి జరిగిన రెండ్రోజుల వ్యవధిలోనే సరిహద్దులో వైమానిక విన్యాసాలు జరపడానికి ప్రత్యేక కారణం ఏమీలేదని, ఇది ముందుగానే నిర్ణయించారని బీఎస్ ధనోవా చెప్పారు. అయినప్పటికీ పాకిస్థాన్ కు ఈ విన్యాసాల ద్వారా సరైన సందేశమే వెళ్లుంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

More Telugu News