India: చావుదెబ్బ కొట్టాలంటే... భారత సైన్యం ముందున్న మార్గాలివే!

  • 43 మందిని బలిగొన్న ఉగ్రదాడి
  • వెంటనే గుణపాఠం చెప్పాలంటున్న భారతీయులు
  • దాడికి సిద్ధంగా ఉన్న సైన్యం

జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి 43 మంది జవాన్ల ప్రాణాలను బలిగొనగా, ప్రతీకారేచ్ఛతో భారత్ రగిలిపోతోంది. వెంటనే ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్ పై కఠినచర్యలు తీసుకోవాలని యావత్ భారతావని నినదిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు వెంటనే గుణపాఠం చెప్పాలంటే భారత్ ముందున్న మార్గాలివి...

ఇప్పటికే విన్యాసాల నిమిత్తం అత్యాధునిక యుద్ధ విమానాలు సరిహద్దుల్లో ఉన్నాయి. వాటి ద్వారా పాక్ కు దిమ్మ తిరిగేలా గైడెడ్ బాంబులు ప్రయోగించడం, సుఖోయ్, మిరేజ్ వంటి ఫైటర్ జెట్లకు క్షిపణులు అమర్చి కీలక స్థావరాలను ధ్వంసం చేయడం. ఈ పని చేసేందుకు పెద్దగా సమయం పట్టదు.

ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాల తరబడి సాగడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం. గతంలో ఓ మారు సర్జికల్ స్ట్రయిక్స్ లో భారత్ విజయం సాధించినా, ఈ మారు అదేపని చేయాలంటే కష్టమే. పాక్ ఇప్పటికే అప్రమత్తమైన నేపథ్యంలో బ్రహ్మోస్ వంటి శక్తిగల క్షిపణులతో ఈ కేంద్రాలపై దాడి చేయవచ్చు.

ఇక మరో మార్గం, సరిహద్దుల్లో పూర్తి స్థాయి సైన్యాన్ని రంగంలోకి దించి, నిర్విరామంగా కాల్పులకు పాల్పడటం. ముఖ్యంగా ఎల్ఓసీ వెంట పాక్ నిత్యమూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉంటే, భారత్ సంయమనంగా ఉంటూ ఉంటుంది. ఇక మనమే ఎదురుదాడికి దిగితే, పాక్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది.

ఎన్నిమార్లు పాక్ కు హితవు పలికినా, బుద్ధి రావడం లేదు కాబట్టి, ఏకంగా పాక్ మిలటరీ స్థావరాలపైనే దాడులు చేయడం. ఈ పని చేయాలంటే, ఇండియాకు అంతర్జాతీయ దేశాల మద్దతు అవసరం. ఆ మద్దతు లభిస్తే, 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బీఎం-30 (స్మెర్చ్) రాకెట్లు, 290 కిలోమీటర్ల దూరం వెళ్లి లక్ష్యాన్ని ఛేదించే బ్రహ్మోస్ క్రూజ్ ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వీటిని యుద్ధ విమానాల ద్వారా సరిహద్దులు దాటకుండానే ప్రయోగించవచ్చు.

వీటితో పాటు దౌత్యాధికారులను వెనక్కు పిలిపించడం, అంతర్జాతీయంగా ఒంటరిని చేయడం, ఆర్థిక ఆంక్షలను పెంచడం వంటి మార్గాలూ ఇండియా ముందున్నాయి.

More Telugu News