Pakistan: ఆర్థిక యుద్ధం: పాకిస్థాన్ ను భలే దెబ్బకొట్టిన భారత్!

  • కస్టమ్స్ సుంకం 200 శాతం పెంపు
  • ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరణ
  • జైట్లీ కీలక నిర్ణయం

ఏ దేశాన్నయినా లొంగదీసుకోవాలంటే దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్నది ఆధునిక యుద్ధతంత్రంలో ప్రధాన సూత్రం. ఇప్పుడు భారత్ చేస్తున్నది కూడా అదే. గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ఆర్థిక ఆంక్షలకు భారత ప్రభుత్వం తెరలేపింది. పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో దేశంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు ఎన్డీయే సర్కారును ప్రభావితం చేస్తున్నాయి.

ఈ క్రమంలో దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే దాయాది దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్న కేంద్రం తాజాగా ఆ దేశానికి మరో పిడుగుపాటు లాంటి నిర్ణయాన్ని వెలువరించింది. పాకిస్థాన్ నుంచి దిగుమతయ్యే అన్నిరకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. జైట్లీ ప్రకటించిన ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ మనదేశానికి చేసే ఎగుమతులపై సుమారు రూ.49 వేల కోట్ల మేర ప్రభావం చూపనుంది.

పాకిస్థాన్ నుంచి భారత్  ప్రధానంగా ముడి ప్రత్తి, నూలు, కెమికల్స్, ప్లాస్టిక్, రంగులు దిగుమతి చేసుకుంటోంది. ఈ వస్తువులపై కస్టమ్స్ సుంకం భారీగా పెంచిన నేపథ్యంలో వ్యాపారులెవరూ వాటి జోలికి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. దాంతో పాక్ లో ఉత్పత్తైన ముడిసరుకు అక్కడే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు భారత్ కోరుకుంటున్నది కూడా అదే. పాకిస్థాన్ కు 1996లో మనవాళ్లు ఎంఎఫ్ఎన్ హోదా ఇచ్చారు. ఈ హోదా ఉన్న దేశాల నుంచి దిగుమతి అయ్యే ముడిసరుకు, వస్తువులపై సుంకాలు చాలా కనిష్టస్థాయిలో ఉంటాయి. అయితే పాకిస్తాన్ కు భారత్ రెండు దశాబ్దాల క్రితమే ఎంఎఫ్ఎన్ హోదా ఇచ్చినా, అదే హోదాను పాక్... భారత్ కు ఇంతవరకు ఇవ్వలేదు. తాజాగా అరుణ్ జైట్లీ తీసుకున్న కస్టమ్స్ సుంకం పెంపు నిర్ణయం పాక్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News