sukhbeer singh badal: నాకు తెలిసినంత వరకు మోదీ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారు: సుఖ్ బీర్ సింగ్ బాదల్

  • ఉగ్రదాడి వెనుక ఐఎస్ఐ హస్తం ఉంది
  • ఏం చేయాలనే విషయంలో మోదీ చాలా స్పష్టంగా ఉన్నారు
  • సిద్దూ వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి గురి చేశాయి

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్ పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందేనని శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన సబ్ ఇన్స్ పెక్టర్ జైమల్ సింగ్ కు ఈరోజు ఆయన నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అనేక మంది వీర జవాన్లను మనం కోల్పోయామని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇది దేశంపై జరిగిన దాడి అని మండిపడ్డారు. పాక్ కు బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయమని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ విషయంలో మోదీ చాలా స్పష్టంగా ఉన్నారని... ఇప్పుడు ఏదో ఒకటి తప్పనిసరిగా చేస్తారని అన్నారు.

ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని బాదల్ చెప్పారు. ఉగ్రదాడికి వ్యూహకర్త ఐఎస్ఐ అని ఆరోపించారు. ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ ఆయుధాలు, మందుగుండును అందిస్తోందని అన్నారు. ఇదే సమయంలో పంజాబ్ మంత్రి సిద్దూపై ఆయన మండిపడ్డారు. దేశం కంటే తన మిత్రులను సమర్థించేందుకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. సిద్దూ ప్రకటనతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.

More Telugu News