Andhra Pradesh: రేపు ఏలూరులో వైసీపీ ‘బీసీ గర్జన’ సభ.. 'బీసీ డిక్లరేషన్'ను ప్రకటించనున్న జగన్!

  • ఏర్పాట్లు పూర్తిచేసిన వైసీపీ నేతలు
  • భారీగా హాజరుకానున్న కార్యకర్తలు, ప్రజలు
  • సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అన్నివర్గాలను దగ్గర చేసుకునే దిశగా సాగుతోంది. అందులో భాగంగా రేపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భారీ స్థాయిలో ‘బీసీ గర్జన’ సభకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న వైసీపీ శ్రేణులు భారీగా ఈ సభకు తరలి రానున్నాయి.  2019లో తాము అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి ఏం చేస్తామో బీసీలకు చెప్పేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు ఏడాదిన్నర క్రితం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఓ అధ్యయన కమిటీని జగన్ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో సాధ్యమైనంత వరకు అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన ఈ కమిటీ.. బీసీ వర్గాల స్థితిగతులను  తెలుసుకుంది. ఈ క్రమంలో సుమారు 136 కులాలకు చెందిన వ్యక్తులతో చర్చించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గత నెల 28న కమిటీ వైసీపీ అధినేత జగన్ కు సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే రేపు జగన్ ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించనున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం చేపట్టే చర్యలను ఈ డిక్లరేషన్ లో పొందుపరిచారు. ఏలూరు శివార్లలోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బీసీ గర్జన సభా వేదికను ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కంతేటి సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో సహా పలువురు వేదిక ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  

More Telugu News