Andhra Pradesh: చంద్రబాబుపై అలిగిన అశోక్ గజపతిరాజు.. ఈరోజు పొలిట్ బ్యూరో భేటీకి డుమ్మా!

  • పార్టీలో ప్రాధాన్యత తగ్గడంపై అలక
  • కిశోర్ చంద్రదేవ్ ఎంట్రీతో ముదిరిన వివాదం
  • భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకూ రానినేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై  ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అలిగారా? అందుకే ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీకి డుమ్మా కొట్టారా? అంటే రాజకీయ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. చాలారోజుల తర్వాత ఈరోజు అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతి రాజు గైర్హాజరు కావడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమయింది.

టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అశోక్ గజపతిరాజు పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన సొంత లోక్ సభ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారని తెలుస్తోంది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్ల పాటు పనిచేసిన నేత కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతానని ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.

ఢిల్లీలో కిశోర్ చంద్రదేవ్ సమావేశమైన విషయాన్ని చంద్రబాబు తనతో చర్చించకపోవడంపై అశోక్ గజపతిరాజు నొచ్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నాయి.

More Telugu News