Andhra Pradesh: వైసీపీలోకి ఆమంచి, అవంతి జంప్ పై.. ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కళా వెంకట్రావు!

  • రాజకీయ విలువలు లేనివారే పార్టీలు మారుతున్నారు
  • పరిపక్వత లేనివారిని విమర్శించడం కూడా అనవసరం
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు వైసీపీలో చేరగా, తాజాగా ఈరోజు నంద్యాలకు చెందిన ఇరిగెల సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి టీడీపీ నేతల చేరికపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విలువలు లేని వ్యక్తులే ఇప్పుడు పార్టీలు మారుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.

రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారుతున్నవారి గురించి, పరిపక్వత లేనివారి గురించి స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

More Telugu News