BJP: తమిళనాట బీజేపీ సీట్ల వేట.. అన్నాడీఎంకేతో పొత్తు కుదిరినట్టే!

  • సీట్ల పంపకంపై స్పష్టత లేక వెలువడని ప్రకటన
  • అర్ధరాత్రి దాటే వరకు ఇరు పార్టీల మధ్య చర్చలు
  • హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

దక్షిణాదిలో బలహీనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడులో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార పార్టీతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో రాష్ట్రంలో దిక్కులేనిదిగా మారిన ఆ పార్టీని అక్కున చేర్చుకుని అనధికారికంగా ప్రస్తుతం పెత్తనం చలాయిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని తన ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు లెక్కలు మొదలుపెట్టింది.

రాష్ట్ర మంత్రులు తంగమణి, వేలుమణితో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ గురువారం చర్చలు జరపడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపై ఓ అవగాహన కుదిరినట్టేనని భావిస్తున్నారు. సీట్ల పంపిణీయే ఇక మిగిలింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.

ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించగా, పార్టీ చీఫ్‌ అమిత్‌షా గురువారం ఈరోడ్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన పీయూష్‌గోయల్‌ పొత్తుపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చినట్టు విమానాశ్రయంలోనే స్పష్టం చేయడంతో తెర తొలగిపోయింది. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. దీంతో గోయల్‌ పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేసి తిరిగి వెళ్తారని ఊహాగానాలు చెలరేగాయి. మంత్రి చెన్నై ఆళ్వార్‌పేటలోని పారిశ్రామికవేత్త పొళ్లాచ్చి మహాలింగం నివాసానికి చేరుకుని రాష్ట్ర మంత్రులు తంగమణి, వేలుమణితో సమావేశమయ్యారు.

కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్‌లు కూడా సమావేశానికి హాజరు కావడం, అర్ధరాత్రి దాటేవరకు చర్చలు సాగడంతో రెండు పార్టీల మధ్య పొత్తుపై ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. రాత్రి ఒంటి గంట తర్వాత చర్చలు ముగించుకుని బయటకు వచ్చిన పీయూష్‌గోయల్‌ ఎటువంటి ప్రకటన చేయకుండానే ఢిల్లీ వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌ మాత్రం ‘చర్చలు సంతృప్తికరంగా సాగాయి, ఇవి కొనసాగుతాయి’ అని చెప్పారు.

కాగా, సమావేశంలో బీజేపీకి కేటాయించే సీట్ల అంశం చర్చకు వచ్చిందని, దానిపై స్పష్టత వచ్చేవరకు ప్రకటన వెలువడే అవకాశం లేదని భావిస్తున్నారు. బీజేపీ 12 ఎంపీ స్థానాలను డిమాండ్‌ చేసిందని, దీనికి అన్నాడీఎంకే ససేమిరా అనడంతో కనీసం 10 స్థానాలైనా ఇవ్వాలని పట్టుబడుతోందని సమాచారం. ముఖ్యంగా దక్షిణ చెన్నై, శ్రీపెరుంబుదూర్‌, వేలూరు, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, కన్యాకుమారి, తంజావూరు, శివగంగై, తిరునెల్వేలి, మధురై నియోజకవర్గాల కోసం బీజేపీ పట్టుబడుతోందని, కానీ మధురై, తిరునెల్వేలి, దక్షిణ చెన్నై, తంజావూరు నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున సాధ్యంకాదని అన్నాడీఎంకే వివరించిందని సమాచారం. అర్ధరాత్రి దాటినా ఈ అంశంపై స్పష్టత రాకపోవడంతో రెండో విడత చర్చలు జరపాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News