Andhra Pradesh: చంద్రబాబును ఎలా దెబ్బతీయాలన్నదే తప్ప, తమ పార్టీని బాగు చేసుకునే ఆలోచన వాళ్లిద్దరికీ లేదు: సోమిరెడ్డి

  • నాడు కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి కన్నా
  • అటువంటి వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారా!
  • ఏపీకి మళ్లీ చంద్రబాబే సీఎం కావాల్సిన అవసరం ఉంది

ఏపీలో చంద్రబాబును ఎలా దెబ్బతీయాలన్న కుట్ర తప్ప, ఈ రాష్ట్రంలో బీజేపీని బాగు చేయాలన్న ఆలోచన ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి కార్యదర్శి సత్యనారాయణకు తన రాజీనామా లేఖను అందజేశారు.

అనంతరం, టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలిసి కూడా ఈ పార్టీ కోసం త్యాగం చేసిన సీనియర్ నేతలు ఉన్నారని అన్నారు. అటువంటి నేతలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి కన్నా అని, అటువంటి వ్యక్తిని బీజేపీలో చేర్చుకుని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశారని విమర్శించారు. నైతిక విలువలకు బీజేపీ తిలోదకాలిచ్చిందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు.

ఇలాంటి వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేస్తే ఇంకా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఎలా బలోపేతమవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ, అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు మాత్రం అపాయింట్ మెంట్ ఇచ్చారని విమర్శించారు. ఏపీలో టీడీపీని ఓడించేందుకు కుట్రలు ఎన్ని పన్నినా, రాష్ట్రంలో తమ సంక్షేమ కార్యక్రమాలను చూసి, జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి మళ్లీ చంద్రబాబే సీఎం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని సోమిరెడ్డి అన్నారు.

More Telugu News