modi: ప్రతీకారానికి టైమ్, ప్లేస్, ఎలా అటాక్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి!: భద్రతాదళాలకు మోదీ అనుమతి

  • ప్రతీకారం తీర్చుకోండి... అనుమతి ఇస్తున్నాం
  • చిప్ప పట్టుకుని అడుక్కుంటున్న పొరుగు దేశం.. నిరాశలో కుట్రలకు పాల్పడుతోంది
  • జవాన్ల త్యాగాలు ఊరికే పోకూడదని 130 కోట్ల మంది కోరుకుంటున్నారు

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో అందరిలో రక్తం మరుగుతోందని ఈ ఉదయం ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రతీకారం తీర్చుకోవాలని భద్రతాదళాలను ఉద్దేశించి అన్నారు. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, స్థలం, ప్రతిస్పందన స్వభావాన్ని మీరే ఎంచుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్ పేరును నేరుగా ఉచ్చరించకుండా... 'పొరుగున ఉన్న దేశం పూర్తి నిరాశలో కూరుకుపోయింది. డబ్బులు లేక సహాయం కోసం ఇతర దేశాల వద్ద చిప్ప పట్టుకొని అడుక్కుంటోంది. ఈ నిరాశలోనే మనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది' అంటూ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ పరిధిలో డిఫెన్స్ కారిడార్ కు ప్రధాని ఈరోజు శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, భారత్ ను కూడా హీనమైన స్థితిలోకి లాగాలని పాకిస్థాన్ కోరుకుంటోందని అన్నారు. ఆ దేశం ఎంచుకున్న తప్పుడు విధానాలతో వారి అభివృద్ధి తిరోగమిస్తోందని... ఇదే సమయంలో సరైన దారిలో వెళ్తున్న మనం దూసుకుపోతున్నామని చెప్పారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలు ఊరికే పోకూడదని 130 కోట్ల భారతీయులు కోరుకుంటున్నారని అన్నారు. తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతాదళాలకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. ఇది సరికొత్త భారత సంప్రదాయం, విధానమని తెలిపారు.

More Telugu News