‘జ‌న‌సేన’ కార్యాలయంలో కొనసాగుతున్న ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్

15-02-2019 Fri 14:58
  • విజయవాడలోని కార్యాలయంలో పరిశీలన ప్రక్రియ 
  • అధిక సంఖ్యలో చేరుకున్న ఆశావహులు
  • ఓ ప్రకటన విడుదల చేసిన ‘జనసేన’
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగదలచిన ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలోని స్థానిక బెంజ్ సర్కిల్ సమీపంలో జనసేన పార్టీ ఏపీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, పి.హరిప్రసాద్, మహేందర్ రెడ్డి ఈరోజు ఉదయం పది గంటల నుంచి అభ్యర్థుల బయోడేటాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు వందల సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ ఈరోజు రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నట్టు పేర్కొంది. స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తుని సునిశితంగా పరిశీలిస్తోందని, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు తమ పనిని కొనసాగిస్తున్నట్టు తెలిపింది.