Kavali: వైసీపీకి షాక్... నెల్లూరు జిల్లా నేతలు కాటంరెడ్డి, వంటేరు రాజీనామా?

  • కావలి టికెట్ ను ప్రతాప్ రెడ్డికి ఖరారు చేసినట్టు వార్తలు
  • జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇద్దరు ముఖ్య నేతలు
  • నేడు కార్యకర్తలతో సమావేశం, అనంతరం రాజీనామా!

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఎదురుకానుంది. ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి నేడు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ అధినేతపై ధిక్కార స్వరం వినిపిస్తున్న వీరిద్దరూ, నేడు తమ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కావలి అభ్యర్థిత్వాన్ని ప్రతాప్ రెడ్డికి జగన్ ఖరారు చేసినట్టు వస్తున్న వార్తలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వైసీపీకి రాజీనామా చేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని వీడి, జగన్ సొంత జెండాను పట్టుకున్న వేళ, నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటగా జగన్ వెంట నడిచిన వ్యక్తిగా కాటంరెడ్డికి గుర్తింపుంది. 2014 ఎన్నికల్లో కాటంరెడ్డికే కావలి సీటు దక్కుతుందని ప్రచారం జరిగినా, అప్పట్లో కుదర్లేదు. ఇక ఈ ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తానని హామీ ఇస్తూ వచ్చి, ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని జగన్ ఎంచుకున్నారని ఆరోపిస్తూ, ఇటీవల వంటేరుతో కలిసి కాటంరెడ్డి కావలి పట్టణంలో పాదయాత్ర చేసి సంచలనాన్నే సృష్టించారు. ఇక వీరిద్దరూ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. 

More Telugu News