India: పక్కా ప్లాన్ తోనే సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి.. ముందుగానే సమాచారం లీక్!

  • జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఘటన
  • 2,547 మందితో బయలుదేరిన కాన్వాయ్
  • అమరులైన 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపొరాలో పక్కా ప్లాన్ తోనే సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందా? భద్రతాబలగాల కదలికలపై ఉగ్రవాదులకు ముందుగానే సమాచారం అందిందా? అంటే రక్షణ రంగ నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ కు వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ కదలికలపై ఉగ్రవాదులకు ఎవరో ముందుగానే సమాచారాన్నిలీక్ చేసి ఉంటారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

2,547 మంది జవాన్లతో 78 వాహనాల్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ బయలుదేరిందనీ, ఇది సాధారణ కాన్వాయ్ కు రెట్టింపు అని చెబుతున్నారు. ఇలా భారీ సంఖ్యలో ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్(ఎస్ వోపీ) పాటించారో, లేదో అన్న విషయం విచారణ అనంతరమే తేలుతుందని వ్యాఖ్యానించారు. జవాన్లు భారీ సంఖ్యలో ఒకేసారి బయలుదేరిన సమయంలో ఈ విషయం ప్రజల దృష్టికి వస్తుందనీ, వారిలో ఎవరో ఒకరు ఉగ్రవాదులకు సమాచారం అందించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ నిపుణులు పుల్వామాలోని ఘటనాస్థలికి చేరుకున్నారు. పుల్వామాలోని అవంతిపొరలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News