CRPF: పుల్వామా ఉగ్రదాడి.. 12 కిలోమీటర్ల దూరం వినిపించిన పేలుడు శబ్దం!

  • భారీ శబ్దంతో పేలిపోయిన సైనికుల బస్సు
  • ఆనవాళ్లు లేకుండా పోయిన ఉగ్రవాది ఉపయోగించిన కారు
  • 2001 తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడి

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలోని అవంతిపొర ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్ కాన్వాప్‌పై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య 43కు చేరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ  ప్రకటించుకుంది. దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో ఉగ్రవాది సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. దీంతో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు పెద్ద శబ్దంతో పేలిపోయి తునాతునకలైంది. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు సంభవించిన పేలుడు శబ్దం ఏకంగా 10-12 కిలోమీటర్ల దూరం వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. శ్రీనగర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.  

పుల్వామా దాడిని దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడిగా చెబుతున్నారు. 2001లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఆనవాళ్లు కూడా లేకుండా తునాతునకలైపోవడం గమనార్హం. పేలుడు శబ్దం విని సమీపంలోని లెథోపొరా మార్కెట్‌లోని వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి పరుగులు తీశారు.

More Telugu News