Helmet: పుదుచ్చేరి ముఖ్యమంత్రి భార్య ఎందుకు చనిపోయారో తెలుసా?: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

  • హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ఆమె చనిపోయారు
  • నా నిర్ణయం నిరంకుశమే అయినా తప్పదు 
  • నా నిర్ణయాన్ని సీఎం తప్పుబడుతున్నారు

పుదుచ్చేరిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గత రెండు రోజులుగా రోడ్లపై తిరుగుతూ హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా గురువారం ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి భార్య ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

గతంలో స్కూటర్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన ఆమె తలకు దెబ్బ తగలడంతో మృతి చెందారని వివరించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధాకరమైనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రోడ్లపై పడి హెల్మెట్ ధరించాలని చెప్పడం నిరంకుశత్వమని సీఎం వ్యాఖ్యానించడాన్ని బేడీ ఎద్దేవా చేశారు.

కాగా, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేయడం, కిరణ్ బేడీ రోడ్లపై తిరుగుతూ బైకర్లకు అవగాహన కల్పించడంపై ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. ఆమె తీరుకు నిరసనగా రాజ్‌భవన్ ఎదుట నిరసనకు దిగారు. 

More Telugu News