China: చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతున్న చైనా

  • సరిహద్దు సమీపంలో మరోసారి దూకుడు
  • వ్యూహాత్మక ఆధిపత్యమే లక్ష్యం

చైనాను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెబుతుంటారు. చైనా ఎప్పుడూ వెనుకంజ వేసినట్టుగానే కనిపిస్తుందని, అదే సమయంలో చేయాల్సిన పని చేసేస్తుందని అంటారు. మొదట దూకుడుగా ఓ ముందడుగు వేస్తుంది... ఆపై ఎంతో విచారం ప్రకటిస్తున్నట్టు నటించి చాపకింద నీరులా పాకిపోతుంది. భారత సరిహద్దుల్లో దశాబ్దాలుగా చైనా చేస్తున్న కుతంత్రం ఇదే. మొన్నామధ్య డోక్లామ్ ప్రాంతంలో రహదారులు, సైనిక స్థావరాలు నిర్మిస్తూ భారత్ ను రెచ్చగొట్టిన చైనా ఇప్పుడు మళ్లీ అదే తరహా చర్యలకు శ్రీకారం చుట్టింది. టిబెట్ లోని గొంగా ఎయిర్ పోర్టును ఇప్పటికిప్పుడు ఆధునికీకరించేందుకు రంగంలోకి దిగింది.

డోక్లామ్ సమస్యే ఇంకా పరిష్కారం కాలేదు. చైనా మాత్రం తాను ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా భారత్ పై వ్యూహాత్మక పట్టు కోసం పాకులాడుతోంది. చైనా అధికార పక్షం అధీనంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గొంగా ఎయిర్ పోర్టును ఆధునిక హంగులతో ముస్తాబు చేసేందుకు రంగంలో దిగింది. దీనిపై భారత వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎందుకంటే గొంగా విమానాశ్రయం భారత సరిహద్దు ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. గొంగా ఎయిర్ పోర్టును తన అధీనంలో ఉంచుకుంటే మాత్రం చైనా చాలా తక్కువ వ్యవధిలో తన బలగాలను భారత సరిహద్దు ప్రాంతానికి తరలించే వీలుంటుంది. ఇప్పుడీ అంశమే భారత్ ను కలవరపెడుతోంది. డోక్లామ్ ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోకున్నా, చైనా బలగాలు కొంతకాలం నిదానించినట్టే కనిపించాయి. కానీ, తన వైఖరి ఇంతేనని తాజా చర్యలతో నిరూపించుకుందీ ఆసియా అగ్రరాజ్యం.

More Telugu News