Pakistan: జైషే మహ్మద్... రక్తపిశాచికి ప్రతిరూపం!

  • భీకర దాడులకు పెట్టింది పేరు
  • భారత్ అంటే తీవ్ర వ్యతిరేకత
  • సాయుధ బలగాలే ప్రధాన లక్ష్యం

ఒకరు కాదు ఇద్దరు కాదు... పదుల సంఖ్యలో జవాన్లు బలైన అత్యంత విషాదకర ఘటన యావత్ భారతదేశాన్ని నిశ్చేష్టకు గురిచేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది జైషే మహ్మద్ ఉగ్రసంస్థ. భారత్ రక్తమోడిన అత్యధిక ఘటనల్లో ఎక్కువగా పాలుపంచుకున్నది ఈ ఉగ్రవాద సంస్థే. భీకర దాడులకు పెట్టింది పేరైన ఈ ఉగ్రవాద సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సామాన్యులను సైతం నిర్దయగా అంతమొందించే ఈ జైషే కిరాతకులు భారత సాయుధ బలగాలపై దాడులు చేయడం అంటే ప్రాణాలకు సైతం తెగించి రంగంలో దిగుతారు.

నేటి సాయంత్రం జమ్మూకశ్మీర్ లోని పుల్వామా వద్ద జరిగిన టెర్రర్ అటాక్ ఈ కోవలోకే వస్తుంది. గత రెండు దశాబ్దాలుగా కశ్మీర్ లో విలయం సృష్టిస్తున్న జైషే సంస్థ తాజా దాడికి కూడా బాధ్యత తీసుకుంది. 2000 నుంచి కశ్మీర్ లో ఉనికిని బలంగా చాటుకుంటున్న జైషే మహ్మద్ 2001లో కనీవినీ ఎరుగని రీతిలో భీకర దాడికి తెగబడింది. శ్రీనగర్ లోని సచివాలయం వద్ద జరిగిన ఈ దాడిలో 38 మంది చనిపోగా, 40 మంది గాయపడ్డారు. ఆ తర్వాత భారత పార్లమెంటుపై దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడిలో ప్రధాన భాగస్వామ్యం జైషే మహ్మద్ ఉగ్రసంస్థకే దక్కుతుంది. ఆధునిక ఉగ్రవాదానికి నిదర్శనంలా నిలిచిన ఈ దాడిని ప్రముఖ అంతర్జాతీయ భద్రతా నిపుణుడు బ్రూస్ రీడెల్ సైతం అసాధారణ ఉగ్రచర్యగా అభివర్ణించాడు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకల్లో జైషే మహ్మద్ తర్వాతే ఎవరైనా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాడి చేయగల మూర్ఖత్వంతో కూడిన తెగింపు జైషే మిలిటెంట్ల సొంతం. తాజాగా సీఆర్పీఎఫ్ బలగాలపై పుల్వామాలో జరిగిన దాడి ఘటన కూడా జైషే రక్తదాహానికి ప్రతిరూపంలా నిలుస్తోంది. దాదాపు అరటన్ను పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడడం అంటే ఊహకు కూడా అందని విషయం. అసలు.. జైషే శిక్షణ క్యాంపుల్లోనే బీభత్సం గురించి నూరిపోస్తారు. పాలుతాగే పసివాళ్లకు సైతం ఉగ్గుపాలతో ఉగ్రపాఠాలు నేర్పించగల సమర్థులు జైషే గ్రూపులో ఉన్నారని చెబుతారు.

అలాంటి ఈ ముష్కర మూక భారత్ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది. దీని నాయకుడు మసూద్ అజహర్ కరుడుగట్టిన భారత వ్యతిరేకుల్లో ముందు వరుసలో ఉంటాడు. భారత్ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తి మసూద్ అజహర్ అని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతుంటాయి. కశ్మీర్ ను భారత్ నుంచి విడదీసి పాకిస్థాన్ లో కలిపేయడమే ఈ సంస్థ ప్రధాన అజెండా. అందుకోసం ఏం చేయడానికి సిద్ధపడే వందలమంది ఉగ్రవాదులు, వేలమంది సానుభూతిపరులతో ఇది పెకలించడానికి వీల్లేనంతగా వేళ్లూనుకునిపోయింది.

More Telugu News