తెలంగాణలో రెచ్చిపోయిన భజరంగ్ దళ్ కార్యకర్తలు.. ప్రేమ జంటకు పార్కులోనే పెళ్లి!

14-02-2019 Thu 14:07
  • మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఘటన
  • పార్కులోనే తాళి కట్టించిన కార్యకర్తలు
  • సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అనీ, దాన్ని పాటించవద్దని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ హిందూ సంఘాలు చెబుతుంటాయి. ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేసేస్తామని హెచ్చరిస్తూ ఉంటాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ సభ్యులు ఈరోజు పెళ్లి చేశారు.

పార్కులో తచ్చాడుతున్న ప్రేమ జంటను చుట్టుముట్టిన సభ్యులు అబ్బాయి చేత యువతికి తాళి కట్టించారు. ఈరోజు చాలా మంచిదనీ, ఆమెకు తాళి కట్టాలని సూచించారు. దీంతో సదరు యువకుడు బిక్కుబిక్కుమంటూ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు.

ఈ తతంగాన్ని భజరంగ్ దళ్ సభ్యులు వీడియో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.