Andhra Pradesh: భోగాపురం విమానాశ్రయానికి నేడు శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు!

  • 2,644 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం
  • వంద ఎకరాల్లో విమానాశ్రయ అనుబంధ సంస్థల ఏర్పాటు
  • విశాఖలో మిలీనియం టవర్స్ ఏర్పాటు చేయనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని దిబ్బలపాలెంలో ఈరోజు ఎయిర్ పోర్టు పనులకు భూమిపూజ చేయనున్నారు. 2,644 ఎకరాల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఏపీలోని విశాఖపట్నం ఐటీ, ఫార్మా హబ్ గా మారుతున్న తరుణంలో రవాణా అవసరాల రీత్యా ఎయిర్ పోర్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే 500 ఎకరాల్లో విమానాశ్రయ అనుబంధ సంస్థలు, 100 ఎకరాల్లో రెండు బ్లాకులుగా వాణిజ్య భవనాలను నిర్మించనున్నారు. మిగిలిన 2044 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.2,200 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. కాగా, భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం  పక్కనే ఉన్న సండ్రీ రిసార్ట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సీఎం శంకుస్థాన చేస్తారు.

అనంతరం కొత్తవలస మండలం చినరావుపల్లిలో రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్, గజపతినగరం మండలం మరుపల్లిలో రూ.50 కోట్లతో నిర్మించనున్న శ్రీచందన ఫుడ్ పార్క్, లక్కవరం మండలం రేగ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఆరోగ్య మిల్లెట్ ప్రాసెసింగ్ కేంద్రానికి కూడా ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం విశాఖకు చేరుకుని మిలీనియం టవర్స్, అబ్దుల్ కలామ్ ముస్లిం కల్చరల్ సెంటర్ సహా పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు.

More Telugu News