south central railway: రైల్లో వినోదం కోరుకునే వారికి శుభవార్త...మ్యూజిక్‌ బాక్స్‌ల ఏర్పాటు

  • అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే
  • సంగీతం, సినిమాలు, ప్రకటనలు
  • సొంత ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి వినొచ్చు

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌ బాక్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది.  కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 12785)లోని ఆరు ఏసీ కోచ్‌లలో ప్రయోగాత్మకంగా దీన్ని వినియోగిస్తోంది. ప్రయాణికులకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందిస్తోంది. సంగీతం, సినిమాలు, ప్రభుత్వ నిర్ణయాలు, రైల్వే సమాచారం తెలుసుకునే  ఏర్పాట్లు చేసింది. దీన్ని మ్యూజిక్‌ బాక్స్‌, వైఫై ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం అంటారు. ఈ వ్యవస్థ ఉత్తరాదిలో కొత్త ఢిల్లీ నుంచి తిరిగే శతాబ్ది, ముంబయి రాజధాని, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలో ఉంది.

తాజాగా దక్షిణ మధ్య రైల్వే దీన్ని అనుసరించి అన్ని రైళ్లలో ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు వైఫై ద్వారా మ్యూజిక్‌ బాక్స్‌తో అనుసంధానమైతే ఇంటర్నెట్‌ అవసరం లేకుండా వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. ఇందుకోసం ముందు సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌తో మ్యూజిక్‌ బాక్స్‌ను అనుసంధానించాలి. అనంతరం బ్రౌజర్‌లోకి వెళ్లి విండోమీద మ్యూజిక్‌ బాక్స్‌ డాట్‌ కామ్‌ అని టైప్‌ చేస్తే అనుసంధానం పూర్తవుతుంది. ఎంచక్కా కార్యకమ్రాలను వినొచ్చు.

More Telugu News