Vellore Central Jail: వేలూరు జైలులో ఆమరణ దీక్షకు దిగిన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు మురుగన్, నళిని!

  • 11 రోజులుగా మురుగన్ దీక్ష
  • ఆరు రోజుల నుంచి ఏమీ తినని నళిని
  • వెంటనే తమను విడుదల చేయాలని డిమాండ్

తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ, తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, నివేదికను గవర్నర్ కు ఆరు నెలల క్రితమే పంపినా, ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ, రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు మురుగన్, నళిని వేలూరు సెంట్రల్ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 11 రోజుల నుంచి మురుగన్, ఆరు రోజుల నుంచి నళిని దీక్ష చేస్తున్నారని జైలు వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని పళనిస్వామి సర్కారు గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. గవర్నర్ వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని తమను జైలు జీవితం నుంచి విముక్తులను చేయాలని నళిని, మురుగన్ లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేంత వరకూ తమ దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 

More Telugu News