లుధియానా సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెల్లడి!

13-02-2019 Wed 09:16
  • కారులో వెళ్తున్న యువతిని బయటకు లాగి అత్యాచారం
  • 16 మంది పాల్గొన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు
  • ఇద్దరి అరెస్ట్.. నిందితుల ఊహా చిత్రాల విడుదల
లుధియానా గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 21 ఏళ్ల కాలేజీ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడింది పదిమంది కాదని, 16 మంది వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు.

తన స్నేహితుడితో కలిసి కారులో ఐజేవాల్ గ్రామం వైపుగా వెళ్తున్న యువతిని అడ్డగించిన యువకులు ఆమెను సమీపంలోని కాలువ ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించింది.  విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న యువతిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనలో 15-16 మంది వరకు పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పంజాబ్ డీఐజీ రణ్‌బీర్ సింగ్ ఖత్రా తెలిపారు. నిందితుల ఊహ చిత్రాలను విడుదల చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. మరో ఆరుగురిని గుర్తించినట్టు డీఐజీ తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. నిజ నిర్ధారణ కోసం ఓ కమిటీని నియమించింది.