Rabert Vadra: కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం నా తల్లిని కూడా వేధిస్తోంది: రాబర్ట్ వాద్రా ఆవేదన

  • నాలుగేళ్ల 8 నెలల పాలనలో గుర్తుకు రాలేదా?
  • ఎన్నికల జిమ్మిక్కుగా అర్థం చేసుకోరని భావిస్తున్నారా?
  • ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాను

 ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, తన తల్లి మౌరీన్ వాద్రాతో కలిసి నేడు ఓ కేసు విచారణ నిమిత్తం జైపూర్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ సైతం హాజరు కావాలని ఈడీ కోరింది. దీంతో, వయోభారంతో బాధపడుతున్న తన తల్లిని ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదంటూ ఫేస్‌బుక్ వేదికగా మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

'‘ఈడీ ఎదుట హాజరయ్యేందుకు నేన, మా అమ్మ జైపూర్‌ చేరుకున్నాం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం.. వయోభారంతో బాధపడుతున్న నా తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదు. రోడ్డు ప్రమాదంలో కుమార్తెను.. డయాబెటిస్‌తో భర్త, ఓ కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న నా తల్లికి తోడుగా ఉండడం కోసం నాతో పాటు ఆఫీసుకు రమ్మనేవాడిని. అలా వస్తే కనుక తనకు కొంత ఊరట లభిస్తుందని ఆశించాను.

నాతో ఆఫీసులో ఉన్నందుకుగానూ ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారు. ఇప్పటికే నన్ను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగిందని మీరు భావిస్తే ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో కాకుండా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక నెల ముందు మాత్రమే ఎందుకు విచారిస్తున్నారు? ఎన్నికల గిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని మీరు భావిస్తున్నారా? నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించాను. దేవుడు మాతో ఉన్నాడు. ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాను. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను’’ అని ఫేస్‌బుక్‌ ద్వారా రాబర్ట్‌ వాద్రా తెలిపారు.

More Telugu News