Rahul Gandhi: మోదీని మరోసారి టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

  • దేశ భద్రత విషయంలో మోదీ రాజీ పడ్డారు
  • అనిల్ అంబానీకి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు
  • రాఫెల్ డీల్ దేశ రహస్య చట్టానికి సంబంధించిన అంశం కూడా

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్ పై ఆయన మాట్లాడుతూ, ఈ డీల్ లో అనిల్ అంబానీకి మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో మోదీ రాజీ పడ్డారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన స్నేహితుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు మోదీ యత్నించారనే విషయానికి సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తోందని రాహుల్ అన్నారు. రూ. 30వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని చెప్పారు. రాఫెల్ డీల్ గురించి రక్షణ మంత్రికి, రక్షణ శాఖకు కూడా తెలియదని... కేవలం మోదీకి, అనిల్ అంబానీకి మాత్రమే తెలుసని అన్నారు.

ఇది కేవలం అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదని... దేశ రహస్య చట్టానికి సంబంధించిన అంశం కూడా అని చెప్పారు. ఒక వ్యక్తి కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయని అన్నారు. ఈ అంశంలో అవినీతి, డీల్ జరిగిన తీరు, దేశ భద్రతలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ క్షమించరాదని చెప్పారు.

మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కూడా రాహుల్ హాజరై, సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, యాంటీ కరప్షన్ క్లాజ్ ను మోదీ తొలగించారంటూ ఓ పత్రికలో కథనం వచ్చిందని చెప్పారు. దేశానికి కాపలాదారుడైన వ్యక్తి దొంగగా మారారంటూ విమర్శించారు.

More Telugu News