Jyothi: మంగళగిరి గ్యాంగ్ రేప్ ఘటనలో కొత్తకోణం: ప్రియురాలిపై హత్యాచారం చేయించింది ప్రియుడే... మృతురాలి సోదరుడి ఆరోపణ!

  • మంగళగిరిలో వెలుగులోకి వచ్చిన దారుణం
  • శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి స్నేహితులకు ఫోన్లు
  • కులాంతర ప్రేమ కోణం దిశగా దర్యాఫ్తు

మంగళగిరికి సమీపంలోని అమరావతి స్టేడియం వెనుకవైపు వెలుగులోకి వచ్చిన జ్యోతి దారుణ హత్యాచారం వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనకు ముందు శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి కొందరు స్నేహితులకు ఫోన్ కాల్స్ వెళ్లాయని, వారే అత్యాచారానికి పాల్పడ్డారని, శ్రీనివాసరావుపై అనుమానం రాకుండా ఉండేందుకు అతన్ని కూడా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మర్డర్ వెనుక కులాంతర ప్రేమ కోణం ఏమైనా ఉందా? అనే దిశగా విచారిస్తున్నామని అన్నారు. శ్రీనివాసరావు బీసీ కులానికి చెందగా, జ్యోతి ఎస్టీ అని చెబుతున్న పోలీసులు, శ్రీనివాసరావును పూర్తి స్థాయిలో విచారిస్తేనే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

కాగా, జరిగిన ఘటనపై స్పందించిన జ్యోతి సోదరుడు, తన చెల్లిని శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి చంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సోదరి శ్రీనివాసరావును ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా అడుగుతుంటే కాలయాపన చేస్తూ వచ్చాడని, చివరికిలా దారుణానికి ఒడిగట్టారని ఆరోపించాడు. వారు మాట్లాడుకోవాలంటే, రోడ్డు పక్కనే కూర్చునేవారని, రోడ్డుకు ఇంతదూరం తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాను శ్రీనివాసరావును హెచ్చరించానని, కొంతకాలం దూరంగా ఉన్న అతను తిరిగి ప్రేమ పేరిట దగ్గరయ్యాడని చెప్పాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News